Chiranjeevi Hanuman Jayanti: మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ జయంతి సందర్భంగా అభిమానులతో ఓ ఆధ్యాత్మిక అనుభూతిని పంచుకున్నారు. ఆంజనేయస్వామిపై తనకున్న భక్తిని మరోసారి చాటుతూ, ఇంటి పూజా మందిరంలో చోటుచేసుకున్న అరుదైన దృశ్యాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం అభిమానులను, భక్తులను ఆకట్టుకుంటోంది.
చిరంజీవి పంచుకున్న వీడియోలో, సూర్యభగవానుడి కిరణాలు ఇంటి పూజా మందిరంలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని తాకుతూ కనిపించాయి.
దీనిపై స్పందించిన ఆయన, “ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుడిని స్పృశించడం ఎంతో దైవానుభూతిని కలిగిస్తోంది” అని అన్నారు.
ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాల కాంతులా మారి పూజా మందిరంలో ప్రసరించడం తాను చూస్తుంటానని చెప్పారు. ఆ క్షణాలను మాటల్లో చెప్పలేనంత ఆధ్యాత్మిక అనుభూతిగా ఆయన అభివర్ణించారు.
ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి పడిన అద్భుతం, అలాగే కోణార్క్, అరసవల్లి దేవాలయాల్లో సూర్యకిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు.
అలాంటి పవిత్ర అనుభూతి తమ ఇంట్లోనూ ఆంజనేయస్వామిని తాకడం తాను “పూర్వజన్మ సుకృతం”గా భావిస్తున్నానని చిరంజీవి భావోద్వేగంగా చెప్పారు.
చివరగా ఆయన అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది.








