Sangeeth Shobhan: యంగ్ హీరో సంగీత్ శోభన్ తాజాగా తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా స్పందించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ‘రాకాస’(Rakasa) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రాన్ని నిహారిక కొణిదెల నిర్మిస్తుండగా, మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ-ఫ్యాంటసీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. శోభన్ తండ్రి నిర్మించిన ‘వర్షం’ సినిమా హిట్ కావడంతోనే హీరో ప్రభాస్, సంగీత్ శోభన్, సంతోష్ శోభన్‌లకు మద్దతు ఇస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సంగీత్ శోభన్ ఆ ప్రచారాలను ఖండించారు.
“మా నాన్నగారు నిర్మించిన ‘వర్షం’ సినిమా హిట్ కావడంతో ప్రభాస్ గారు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు.
ఆ సినిమాహిట్ అయిన కాకపోయినా ప్రభాస్ మమ్మల్ని ఇలాగే ప్రోత్సహించేవారు. ఎందుకంటే ఆయన స్వభావం అలాంటిది. ఒకరికి సహాయం చేయాలంటే ఫలితం గురించి ఆలోచించరు” అని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. మరోవైపు ‘రాకాస’ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని సంగీత్ ఆశిస్తున్నారు.
ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గెటప్ శ్రీను, వాసు ఇంటూరి వంటి కామెడీ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.







