Hyderabad: నగరంలో మరో అగ్నిప్రమాదం కలకలం రేపింది. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో ఉన్న శృతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆసుపత్రి భవనంలోని మూడో అంతస్తులో ఉన్న ఒక ఏసీ (AC) ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
ఏసీ పేలుడు ధాటికి మంటలు భారీగా ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రాణభయంతో అందరూ హాస్పిటల్ నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు. సకాలంలో స్పందించి రోగులను బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.








