మచిలీపట్నం: స్థానిక జిల్లా కోర్టుకు సోమవారం బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
జిల్లా కోర్టు న్యాయమూర్తి గోపి అధికారిక ఈ-మెయిల్‌కు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు సందేశాన్ని పంపారు. కోర్టు ప్రాంగణంలో బాంబులు ఉన్నాయంటూ మెయిల్ రావడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం హుటాహుటిన కోర్టు వద్దకు చేరుకుంది. ముందుజాగ్రత్త చర్యగా కోర్టు హాల్స్ నుంచి న్యాయవాదులను, సిబ్బందిని, వివిధ కేసుల నిమిత్తం వచ్చిన కక్షిదారులను సురక్షిత ప్రాంతాలకు పంపించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బందిని రంగంలోకి దించి కోర్టు ప్రాంగణమంతా అణువణువూ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
సరిగ్గా కోర్టు కార్యకలాపాలు జరిగే సమయంలో ఈ బెదిరింపులు రావడంతో కక్షిదారులు, న్యాయవాదులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? ఇది ఆకతాయిల పనా లేక నిజమైన బెదిరింపా? అన్న కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.







