ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి దురదృష్టకర మరణం చెందాడు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
చంద్రశేఖర్ డెంటల్ కోర్సు (బీడీఎస్) పూర్తిచేసిన తర్వాత, మరింత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. కానీ తన కలలు సాకారం కావాల్సిన సమయానికి, దుండగుల బుల్లెట్లకు బలి కావడం అతని కుటుంబ సభ్యులను, స్నేహితులను, తెలుగు సమాజాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతోంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అన్నారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని, చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వస్థలానికి త్వరగా తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక ప్రతిభావంతమైన యువకుడు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం ఎంతటి దుర్ఘటనో తెలుగువారి మనసులను కలచివేస్తోంది.
