ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. కురిసిన భారీ వర్షాలతో వాగులు, గెడ్డలు, చిన్నా పెద్ద నదులు పొంగిపొరలుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
అల్లూరి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పెదబయలు – పాడేరు మండలాల మధ్య ఉన్న పరదానిపుట్టు వంతెనపై వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. దీంతో దాదాపు 60 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాడేరు – హుకుంపేట మార్గంలో వరదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. బర్మాన్‌గూడ, పాటిమామిడి, డి.చింతలవీధి సమీపంలోని పొలాల్లో రైతులు వేసిన వరినాట్లు వరదలతో కొట్టుకుపోయాయి.
మత్స్యగెడ్డ వాగు పొంగి ప్రవహించడం వల్ల పాడేరు, పెదబయలు మండలాలకు వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో చెక్కరాయి గ్రామానికి చెందిన ఓ తండ్రి తన చిన్నారిని భుజాలపై ఎత్తుకొని వాగు దాటించి ఒడ్డుకు చేర్చిన దృశ్యం అందరినీ కదిలించింది. ఈ తరహా పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయని, ఒకవేళ వంతెన నిర్మిస్తే పాడేరు–పెదబయలు సరిహద్దు సమస్యలు తగ్గుతాయని గ్రామస్థులు విన్నవిస్తున్నారు. వర్షాకాలంలో బయలుదేరినవారు తిరిగి ఇళ్లకు చేరే సమయానికి వాగులు పొంగిప్రవహించడం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి ఉద్ధృతి కూడా మరింత పెరిగింది. దేవీపట్నం మండలంలోని పోశమ్మగండి వద్ద గోదావరి నది ఉప్పొంగి, పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రానికి గోదావరి నది నిండు కుండలా మారి ప్రజల్లో ఆందోళన పెంచింది.
మరోవైపు ముంచంగిపుట్టు మండలం కోసంపుట్ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో రవాణా స్తంభించింది. జోడిగుమ్మ, పట్న, కోసంపుట్, పడల్‌పుట్ గ్రామాలు పూర్తిగా బయటి ప్రపంచంతో వేరుపడ్డాయి. ఈ గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని, ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి మండలంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
ప్రజలు వర్షాల కారణంగా ఆహారం, ఔషధాల కొరత తలెత్తుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. రాకపోకలు స్తంభించడంతో అత్యవసర సేవలు కూడా అంతరాయానికి గురవుతున్నాయి. మరోవైపు వరి పంటలు, కూరగాయల పొలాలు ముంపులోనికి వెళ్లడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మొత్తానికి ఉత్తరాంధ్రలో వర్షం బీభత్సం కొనసాగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు మరింత కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
