PRC Extension: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నిరాశే ఎదురైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త పీఆర్‌సీపై స్పష్టత వస్తుందని భావించిన ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగింపు నిర్ణయంతో షాక్ ఇచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) గడువును ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పీఆర్‌సీ కమిటీ గడువు మార్చి 31తో ముగియనుండగా, ఆ గడువు ముగియడానికి కేవలం కొద్ది రోజులే మిగిలి ఉన్న సమయంలో మరో ఆరు నెలల పాటు కమిటీకి ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం గమనార్హం.
కొత్త పీఆర్‌సీ కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. దీంతో ఉద్యోగ సంఘాల్లో అసంతృప్తి మరింత పెరుగుతోంది.
ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి, కొత్త పీఆర్‌సీపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం నివేదిక స్వీకరణ కంటే గడువు పొడిగింపునే ఎంచుకుంది.
ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఈ అంశం అసెంబ్లీలో ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కొత్త పీఆర్‌సీ అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా ఆ హామీ అమలు కాలేదని విపక్షాలు విమర్శించాయి.
ముఖ్యంగా బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. కనీసం ఇప్పుడైనా పీఆర్‌సీ నివేదిక తీసుకుని ఉద్యోగులకు కొత్త వేతన సవరణ ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం కొత్త పీఆర్‌సీపై టైమ్‌లైన్ ప్రకటించకుండా, కమిటీ గడువును మరోసారి పొడిగించడం ఉద్యోగుల్లో మరింత నిరాశకు దారితీసింది. దీంతో కొత్త పీఆర్‌సీ ఎప్పుడు వస్తుందన్న ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది.
PRC Extension | ఉద్యోగుల ఆశలకు మళ్లీ బ్రేక్.. పీఆర్‌సీ కమిటీకి మరో ఆరు నెలల ఎక్స్‌టెన్షన్
-








