Sri Rama Navami 2026: శ్రీరామ నవమి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. శ్రీరాముడి జన్మదినంగా ఈ రోజును భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే 2026లో ఈ పండుగ తేదీ విషయంలో కొంత గందరగోళం నెలకొంది.
పంచాంగాల ప్రకారం రామ నవమి తిథి మార్చి 26 ఉదయం 11:48 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:06 గంటలకు ముగుస్తుంది.
శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించినందున గృహస్థులు మార్చి 26న పండుగను జరుపుకోవడం శ్రేయస్కరం అని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు వైష్ణవ సంప్రదాయం ప్రకారం మార్చి 27న ఆచరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
ఈ సందర్భంగా శుభ ముహూర్తం ఉదయం 11:13 నుంచి మధ్యాహ్నం 1:41 వరకు ఉండగా, జన్మ సమయం మధ్యాహ్నం 12:27గా పేర్కొంటారు. రామ నవమి రోజున భక్తులు తెల్లవారుజామున స్నానం చేసి, పవిత్రంగా శ్రీరామునికి పూజలు చేస్తారు. దేవాలయ దర్శనం లేదా ఇంట్లోనే పూజలు నిర్వహించడం సంప్రదాయం.
రామాయణం లేదా రామచరితమానసం పఠించడం విశేష ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. పేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేయడం కూడా ఈ రోజు ముఖ్యమైన ఆచారం.
ఉపవాసం పాటించే వారు నిరాడంబరత, పవిత్రత పాటించాలి. కొందరు నిర్జల ఉపవాసం చేస్తే, మరికొందరు పండ్లు, పాలు, సగ్గుబియ్యం వంటి తేలికపాటి ఆహారం తీసుకుంటారు. సైంధవ లవణం ఉపయోగించడం ఆనవాయితీ.
ఈ రోజున ధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం వంటివి తినకూడదు. కోపం, నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. “ఓం శ్రీ రామాయ నమః”, “శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్” వంటి మంత్రాలను జపించడం ద్వారా మనశ్శాంతి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని విశ్వాసం.







