Cm Revanth Reddy: తెలంగాణలో విద్య, పేదల వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో మాట్లాడిన ఆయన, వైద్య రంగానికి భారీగా నిధులు కేటాయించి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను పెండింగ్‌లో ఉంచిందని విమర్శించిన సీఎం, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
ఇప్పటివరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మొత్తం రూ.2,408 కోట్లు చెల్లించామని సీఎం వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.
అలాగే తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ.2,046 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు. గతంలో ఈ నిధుల పంపిణీలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 27 నెలల పాలనలో పేదల వైద్య సేవల కోసం మొత్తం రూ.4,500 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. టీచింగ్ కాలేజీలకు రోగుల రాక తక్కువగా ఉందని, వాటి నిర్వహణను మెరుగుపర్చేందుకు గ్రూప్-1 అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నామని కూడా వెల్లడించారు.
అదే సమయంలో విదేశాల్లో నైపుణ్యం కలిగిన వైద్యుల సేవలను రాష్ట్రంలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
గోషామహల్‌లో 30 ఎకరాల్లో రూ.3,000 కోట్ల వ్యయంతో ఆధునిక ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నామని, పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రభుత్వానికి ప్రజలు, నిపుణులు ఇచ్చే సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.








