Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్2’(Dhurandhar 2) ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సినిమా విడుదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, విదేశాల్లోనూ భారీ ఆదరణ దక్కుతోంది.
ఇప్పటికే దక్షిణాది సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించగా, బాలీవుడ్ నుంచి స్పందనలు మాత్రం తక్కువగా వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్‌ఖాన్ స్పందించడం ప్రత్యేకంగా నిలిచింది.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమిర్‌ఖాన్‌ను మీడియా ప్రతినిధులు ‘ధురంధర్2’ గురించి ప్రశ్నించగా, ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ‘‘నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ, ఈ సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందన గురించి విన్నాను.
‘ధురంధర్1’ తర్వాత ఇప్పుడు ‘ధురంధర్2’ కూడా ఘన విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది. చిత్రబృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని అన్నారు. దీంతో బాలీవుడ్ అగ్ర నటుల్లో ఈ చిత్రంపై స్పందించిన అరుదైన స్టార్‌గా ఆమిర్ నిలిచారు.
ఇక బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్2’ దూకుడు మామూలుగా లేదు. విడుదలై వారం రోజులు పూర్తయ్యే సరికి ఈ చిత్రం ఇండియాలోనే సుమారు “రూ.766 కోట్లు గ్రాస్” వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విదేశాల్లో ఇప్పటికే “రూ.250 కోట్లకు పైగా”వసూళ్లు సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా “రూ.1000 కోట్ల క్లబ్‌లోకి” ఎంట్రీ ఇచ్చింది. ఈ అరుదైన మైలురాయిని అందుకున్న 10వ భారతీయ చిత్రంగా ‘ధురంధర్2’ తన పేరు నమోదు చేసుకుంది.
హిందీ చిత్రాల్లో ‘దంగల్’, ‘జవాన్’, ‘పఠాన్’, ‘ధురంధర్1’ సరసన ‘ధురంధర్2’ చోటు సంపాదించుకుంది. అలాగే వరుసగా రెండు చిత్రాలతో “రూ.1000 కోట్ల మార్క్” అందుకున్న నటుల జాబితాలో రణ్‌వీర్ సింగ్ కూడా చేరాడు. మొదటి వారంలోనే “‘పుష్ప2’” హిందీ రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టింది.
హిందీలో ‘పుష్ప2’ “రూ.425 కోట్లు” రాబట్టగా, ‘ధురంధర్2’ ఇప్పటికే “రూ.546 కోట్లు” సాధించింది. అంతేకాదు, ఓపెనింగ్ రోజునే “రూ.99.10 కోట్లు” వసూలు చేసి హిందీలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా కొత్త చరిత్ర సృష్టించింది.








