ఈ దీపావళి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాలుగు సినిమాల్లో మొదటిది ‘మిత్ర మండలి’. ఈ సినిమాకు ముందు నుంచీ ప్రచారం జరుగుతున్న విధంగా – “కథ లేదు, కేవలం వినోదమే లక్ష్యం” అని చిత్ర బృందం చెప్పిన మాట, సినిమాను చూసిన తర్వాత నిజమే అని తెలుస్తుంది. కానీ, ఎలాంటి కథ లేకుండా ప్రేక్షకులను నవ్వించాలన్న ప్రయత్నం ఎంతవరకు సఫలం అయ్యిందనే దానిపై పెద్ద ప్రశ్నే మిగిలిపోతుంది.
సినిమా కథకు సంబంధించి చెప్పాలంటే, ఫిక్షన్ కులం తుట్టేకులం, ఆ కులానికి నాయకుడు నారాయణ (వీటీ గణేశ్) తన కులబలంతో ఎమ్మేల్యే కావాలనుకుంటాడు. కానీ అతని కూతురు స్వేచ్చ (నిహారిక) ఇంటి నుంచి పారిపోవడం వల్ల రాజకీయంగా అతనికి సమస్యలు తలెత్తతాయి. ఆమెను వెతికేందుకు ఎస్సై సాగర్ (వెన్నెల కిషోర్) సహాయంతో ప్రారంభించే యాత్ర, నలుగురు యువకులు ఇందులో భాగమవుతారు. ఇదే సినిమా కథ – ఆ తర్వాత ఏమి జరిగిందనేది మాత్రమే కథనం. కానీ ఇది కథ అనుకోవాలా? అనేది అసలే ప్రశ్న.
సినిమా విశ్లేషణలోకి వెళితే:
కథ లేకుండా సినిమా తీయడమే కాదు, దానికి మించిన స్క్రీన్‌ప్లే, సన్నివేశాల పక్కా ప్రణాళిక అవసరం. కానీ ఈ సినిమాలో కథతో పాటు హాస్యాన్ని అందించగల బలమైన సన్నివేశాలు కూడా లేవు. ప్రతి సన్నివేశం నిస్సారంగా, బలవంతంగా నవ్వించాలనే ఉద్దేశంతో ఉండి, సహజతని కోల్పోయింది. చిన్న కథలతో కామెడీగా విజయాన్ని అందుకున్న ‘జాతి రత్నాలు’, ‘లిటిల్ హార్ట్స్’ వంటి సినిమాల వలే ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న ప్రయత్నం కనిపించినా, తేలికపాటి కథను అర్థరహితంగా ప్రదర్శించడం వల్ల ప్రయోగం విఫలమైంది.
నటీనటుల విషయానికి వస్తే:
టాలెంట్ ఉన్న వెన్నెల కిషోర్, సత్య, ప్రియదర్శి, రాగ్ మయూర్ లాంటి నటులందరూ తమ క్యారెక్టర్స్‌లో కనీస విలువ లేకపోవడంతో ప్రతిభను చూపలేకపోయారు. నిహారిక పాత్ర కూడా తక్కువ ప్రభావం చూపింది. సాంకేతికంగా కొన్ని చోట్ల ఫర్వాలేదన్నా, నిర్మాణ విలువలు అధమంగా ఉండడం స్పష్టంగా తెలుస్తుంది.
అంతిమంగా:
సినిమా ప్రారంభంలో చూపించిన ఓ సందర్భం – బ్యాట్, బాల్ లేకుండానే క్రికెట్ ఆడుతున్న సన్నివేశం – ఈ సినిమా మొత్తాన్ని perfectly reflect చేస్తుంది. ఆడియన్స్‌ను మోసం చేయడమే లక్ష్యంగా కథను లేకుండా రూపొందించినట్టుగా అనిపిస్తుంది. నిర్మాత బన్నీవాస్ మాట్లాడుతూ ఈ కథ వినిపించినపుడు కడుపుబ్బ నవ్వేశానంటారు. కానీ సినిమా చూసినవారికి మాత్రం ఆ నవ్వుల కన్నా విసుగు ఎక్కువగా వచ్చింది.
సినిమా ఒక బాధ్యత, ప్రేక్షకుల నమ్మకానికి సమాధానం. అలాంటి నమ్మకాన్ని ఇలా తేలికగా తీసుకుంటూ, హాస్య సినిమాల పేరిట ఏదైనా చూపించగలమన్న అభిప్రాయం సినిమాకే ప్రమాదకరం.
‘మిత్ర మండలి’ అనే పేరు పెట్టుకున్నా, ఇది మిత్రులకు కూడా రికమెండ్ చేయలేని చిత్రం.
