క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈసారి వేలం డిసెంబర్ 14న జరగనున్నట్లు సమాచారం. అవసరమైతే డిసెంబర్ 13న కూడా షెడ్యూల్ మార్చే అవకాశం ఉందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వర్గాలు సూచించాయి.
గత రెండు సీజన్లుగా విదేశాల్లో జరిగిన వేలాలు — దుబాయ్, జెడ్డాల్లో జరిగినా, ఈసారి మాత్రం రెండేళ్ల విరామం తర్వాత భారత్‌లోనే వేలం జరుగనుంది. ఆతిథ్య వేదిక కోసం ముంబై, బెంగళూరు నగరాలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉంటుంది.
గత సీజన్‌లో ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జట్టు చివరకు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి, రజత్ పాటిదార్ కెప్టెన్సీలో తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ, ఈసారి తమ జట్టును మరింత బలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) వంటి జట్లకు ఈ వేలం అత్యంత కీలకం కానుంది. గత సీజన్‌లో చెన్నై పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది. అంతేకాకుండా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ కారణంగా సీఎస్‌కే పర్సులో గణనీయమైన మొత్తంలో డబ్బు చేరింది. దీంతో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు చెన్నైకు పెద్ద అవకాశమొచ్చింది.
ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే, కెప్టెన్ సంజూ శాంసన్ ట్రేడ్‌పై ఆలోచనలు జరుగుతున్నాయని సమాచారం. శాంసన్‌ను మరో ఫ్రాంచైజీకి ఇవ్వాలా లేదా అనేది ఆర్‌ఆర్ మేనేజ్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం జట్టు భవిష్యత్ వ్యూహాలపై ప్రభావం చూపనుంది.
అంతేకాకుండా, కొత్తగా వచ్చే విదేశీ ఆటగాళ్ల జాబితా, యువ టాలెంట్‌లపై ఫ్రాంచైజీలు కన్నేసి ఉంచాయి. వేలం వేదిక, జట్ల రిటెన్షన్ లిస్టులు, స్టార్ ఆటగాళ్ల ట్రేడ్‌లతో వచ్చే వారాల్లో ఐపీఎల్ మళ్లీ దేశంలో క్రికెట్ హీట్‌ను పెంచబోతోంది.
