రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు పోటీ జరుగనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన జరగగా, ఉపసంహరణకు అక్టోబర్ 15వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు.
ఎస్ఈసీ మార్గదర్శకాలు ప్రకారం, ఎంపీటీసీ అభ్యర్థులు మండల పరిషత్ కార్యాలయంలో, జడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలి. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థితో పాటు కేవలం నలుగురు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని, ఐదుగురికి మించి అనుమతించబోమని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
అభ్యర్థులు సమర్పించాల్సిన డిపాజిట్ ఫీజులు కూడా ఖరారయ్యాయి. జడ్పీటీసీకి పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.5,000, రిజర్వ్డ్ అభ్యర్థులు రూ.2,500 చెల్లించాలి. ఎంపీటీసీ స్థానాలకు జనరల్ అభ్యర్థులు రూ.2,500, రిజర్వ్డ్ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాల్సి ఉంటుంది.
నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థులు పూర్తి ధ్రువపత్రాలు, ఫోటోలు, డిపాజిట్ రసీదులు జతచేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికల పోటీ సన్నాహాలు వేగం పుంజుకున్నాయి.
