TTD Updates: తిరుపతి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం నిర్వహించిన ఈ–డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. దాదాపు 1.8 లక్షల టోకెన్ల కేటాయింపుకై రాష్ట్రవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి రికార్డు స్థాయిలో 24 లక్షలకుపైగా భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు.
నవంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి 1న జరగనున్న దర్శనాల కోసం ఈ–డిప్ ద్వారా కేటాయింపులు చేపట్టనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
రేపు నిర్వహించనున్న ఈ–డిప్‌లో ఎంపికైన భక్తులకు ఆన్లైన్ ద్వారా టోకెన్లు అందజేయనున్నారు. మొత్తం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించబడ్డాయి.
మొత్తం రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 13.4 లక్షల మంది భక్తులు నమోదు కాగా, టీటీడీ వెబ్‌సైట్‌లో 9.3 లక్షలు, ఏపీ ప్రభుత్వ వాట్సాప్ సేవ ద్వారా 1.5 లక్షల మంది పేర్లు నమోదు చేశారు. జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం యథాతథంగా కొనసాగనుంది.
చివరి ఏడు రోజుల్లో రోజుకు రూ.300 దర్శనం కోసం 15 వేల టిక్కెట్లు, శ్రీవాణి కోసం రోజుకు వెయ్యి టిక్కెట్లు డిసెంబర్ 5న ఆన్లైన్‌లో విడుదల చేయనుంది.
జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానిక భక్తుల కోసం రోజుకు 5 వేల టోకెన్లు డిసెంబర్ 10న విడుదల చేస్తారు. ఈ సంవత్సరం వైకుంఠద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి సూచనల ప్రకారం భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.
