కాంతార చాప్టర్ 1 థియేటర్లో పంజుర్లి సంచలనం!


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 224 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ సర్కిల్స్‌కి షాక్ ఇచ్చింది. దసరా సెలవుల హంగుతో దేశవ్యాప్తంగా థియేటర్లు హౌస్‌ఫుల్‌ అవుతుండటమే కాదు, కొన్ని థియేటర్లలో వింత ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల తమిళనాడు రాష్ట్రం దిండిగల్ లోని ఒక థియేటర్‌లో ‘కాంతార చాప్టర్ 1’ ప్రదర్శన జరుగుతుండగా, పంజుర్లి దైవం వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా థియేటర్లోకి ప్రవేశించాడు. తెరపై కనిపిస్తున్న రిషబ్ శెట్టి నృత్యాన్ని తానే చేస్తున్నట్లుగా అనుకరించి స్టేజ్ వద్ద డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ అపూర్వం దృశ్యాన్ని చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొంతమంది దీనిని నిజంగా దైవ ఆవహం అనుకుంటూ భయపడ్డారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనతో పాటు, సినిమా విజయం కూడా ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. గతంలో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్ కావడం వల్ల ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టడం విశేషం.

హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, రిషబ్ శెట్టికి జోడిగా రుక్మిణి వసంత్ నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ సినిమా విజయం, పంజుర్లి వేషంలో థియేటర్లో వ్యక్తి చేసిన హల్‌చల్ కలగలిపి ఈ చిత్రాన్ని మరింతగా వార్తల్లో నిలిపాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమనే అభిప్రాయంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *