Israel Airstrikes: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత నెల 28న ప్రారంభమైన ఇజ్రాయెల్–ఇరాన్(Israel-Iran) ఘర్షణలు ఇప్పుడు భారీ దాడులు, ప్రతిదాడులతో తీవ్రరూపం దాల్చాయి.
తాజాగా ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్‌లో ఉన్న భూగర్భ బంకర్లను లక్ష్యంగా చేసుకుని మెరుపుదాడులు చేసింది. ఈ బంకర్లు ఇరాన్ మాజీ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ కోసం నిర్మించబడినవిగా సమాచారం.
ఇజ్రాయెల్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొసాద్ సహకారంతో సుమారు 50 ఫైటర్ జెట్‌లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. టెహ్రాన్ నగరంలోని భూగర్భ నిర్మాణాలపై భారీ బాంబులు వేయడంతో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి.
ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ బంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలిపింది. ఈ భూగర్భ నిర్మాణాల్లో ఇరాన్ ప్రభుత్వ కీలక అధికారులు సమావేశాలు నిర్వహించేవారని సమాచారం.
పశ్చిమ దేశాలపై దాడుల ప్రణాళికలు కూడా ఇక్కడే రూపొందించబడుతున్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
ఇప్పటికే జరిగిన దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఈ యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
