
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రీవెన్స్ సెల్ ముందు నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి 11 నెలలు పూర్తయినా నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం దారుణమని నాయకులు విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని, ప్రభుత్వంపై యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తెలిపారు.
నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడాన్ని ఖండించారు. నిరుద్యోగ యువత కోచింగ్ కోసం కుటుంబ ఆస్తులను అమ్ముకుని ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం తమ మాట తప్పిందని మండిపడ్డారు. మెగా డీఎస్సీ ప్రకటన ఇప్పటికీ ఆలస్యమవుతున్నదని, యువత నిరీక్షణలో మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు భవిష్యత్‌పై భయంతో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమని నిరసనకారులు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించకపోతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నేతలు అరవింద్, వసంత్, మధు, రాజు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.