PM Modi Speech: దేశ ఆర్థిక ప్రగతి, పేదరిక నిర్మూలన అంశాలపై రాజకీయంగా మరోసారి చర్చ మొదలైంది. గత ప్రభుత్వాల విధానాలను తప్పుబడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ శతాబ్ది సదస్సులో పాల్గొన్న ఆయన.. దేశ అభివృద్ధికి గత ప్రభుత్వాల విధానాలే అడ్డంకిగా మారాయని వ్యాఖ్యానించారు. ఫిక్కీ సంస్థ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సదస్సులో మోడీ భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి ప్రణాళికలు, పేదరిక నిర్మూలనపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అనుసరించిన పాత విధానాల కారణంగా దేశ ప్రగతి ఆశించిన స్థాయిలో సాగలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధానపరమైన మార్పులు తీసుకొచ్చి అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసిందని పేర్కొన్నారు.
తమ పాలనలో గత 12–13 ఏళ్ల కాలంలో 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు నివేదికలను ఉటంకిస్తూ ప్రధాని వెల్లడించారు. 1970వ దశకంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘గరీబీ హటావో’ నినాదాన్ని ఇచ్చినప్పటికీ, పేదరిక నిర్మూలనలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని విమర్శించారు. అప్పట్లో దేశ జనాభా సుమారు 50 కోట్లుగా ఉండేదని గుర్తుచేశారు. సరైన విధానాలు, బలమైన సంకల్పం ఉంటే తక్కువ సమయంలోనే ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని మోడీ అన్నారు. భారత్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, ఇదే వేగంతో ముందుకు సాగితే దేశం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా, పేదరిక నిర్మూలనలో తమ ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పాలనపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
ALSO READ: Vande Bharat Express | ఏపీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖ నుంచి తిరుపతికి మరో వందేభారత్