Siddaramaiah | మళ్లీ సీఎం కావాలన్న అనుచరుల ఆశలకు షాక్.. ఎన్నికల్లో పోటీ చేయనన్న మాజీ ముఖ్యమంత్రి

Siddaramaiah

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తారా? లేదా? అనే ప్రశ్నలకు ఆయనే స్వయంగా తెరదించారు. ఇకపై ఎన్నికల బరిలోకి దిగే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు. మైసూరులో గురువారం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య.. తనకు ప్రస్తుతం 80 ఏళ్లు వచ్చాయని, ఈ వయసులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వయసు దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. మరోసారి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తనకు ఐదో వరుసలో సీటు కేటాయించడంపై కూడా సిద్ధరామయ్య స్పందించారు. పార్టీ అధిష్ఠానం తనను అవమానించిందన్న ప్రచారాన్ని ఖండించారు. తాను కార్యక్రమానికి ఆలస్యంగా చేరుకోవడం వల్లే వెనుక వరుసలో కూర్చోవాల్సి వచ్చిందని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో విభేదాల కారణంగా కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను పక్కన పెడుతోందని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ప్రతిపక్ష నేత ఆర్. అశోక విమర్శలు చేశారు. అయితే ఈ ఆరోపణలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. మొత్తానికి, మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న అనుచరుల ఆశలు ఒకవైపు.. ఎన్నికలకు దూరంగా ఉంటానన్న సిద్ధరామయ్య నిర్ణయం మరోవైపు కర్ణాటక కాంగ్రెస్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. భవిష్యత్తులో ఆయన రాజకీయ పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related posts

VS Babu | స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ కన్నుమూత.. టీవీకేలో తీవ్ర విషాదం

Supreme Court | రెండో పెళ్లి పిల్లలకూ తల్లి ఆస్తిలో హక్కు ఉంటుంది.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

PM Modi Speech | కాంగ్రెస్ విధానాలే అభివృద్ధికి అడ్డంకి.. మోడీ కీలక వ్యాఖ్యలు

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More