Telangana Rains: హైదరాబాద్ వాతావరణం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. గాలులు వీచడం, ఆకాశం మబ్బుల వల్ల నగరంలో చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది.
చాలా రోజుల తర్వాత కురిసిన తేలికపాటి వర్షాలు భాగ్యనగరాన్ని మురిపించాయి. అబిడ్స్, బషీర్ బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, మీర్ పేట్, బడంగ్ పేట్ ప్రాంతాల్లో చిల్లర వాన కురిసింది. ఎల్బీ నగర్, మలక్ పేట్, సరూర్ నగర్, చార్మినార్, బీఎన్ రెడ్డి, ఉప్పల్, నాగోల్, అంబర్ పేట్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయి.
వికారాబాద్ దిశ నుంచి వచ్చే భారీ ఈదురు గాలులు సాయంత్రం 6 గంటల తర్వాత గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, లింగంపల్లి పరిసరాల్లో చిరు జల్లులతో కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు. అయితే, జిల్లాల్లో గాలులు తీవ్ర ప్రభావం చూపించాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. గాలుల ధాటికి చెట్లు విరిగిపడటం, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది.
భారీ గాలుల ప్రభావంతో షాపుల బోర్డులు, ఫ్లెక్సీలు ఎగిరిపోయి, కొన్నిరేకుల ఇళ్లు భాగంగా ధ్వంసమయ్యాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.




