T20 World Cup Crisis: బాంగ్లాదేశ్ T20 World Cup నుంచి తప్పుకునే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB)కు భారీ ఆర్థిక నష్టం తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం అమలైతే, ఐసీసీ(ICC) నుంచి వచ్చే వార్షిక ఆదాయంలోనే సుమారు రూ.325 కోట్ల అంటే 27 మిలియన్ డాలర్లు నష్టం వచ్చే ప్రమాదం ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.
బుల్బుల్‌కు అవమానకర పరిస్థితి
బంగ్లాదేశ్ తొలి టెస్ట్ శతకవీరుడిగా గుర్తింపు పొందిన అమీనుల్ ఇస్లాం ‘బుల్బుల్’ ప్రస్తుతం బీసీబీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలంలోనే జాతీయ జట్టు ఓ ఐసీసీ టోర్నమెంట్ నుంచి తప్పుకునే పరిస్థితి రావడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. ఈ పరిణామం బుల్బుల్‌కు వ్యక్తిగతంగా తీవ్ర పరాభవంగా మారిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ జోక్యమే కారణం
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలోని క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తీసుకున్న కఠిన వైఖరే ఈ వివాదానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. భద్రతా కారణాలను “జాతీయ ప్రతిష్ఠ”తో ముడిపెట్టి భారత్‌లో ఆడే అవకాశమే లేదని స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
వరల్డ్ కప్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌కూ ముప్పు
టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు కలిపి మొత్తం ఆర్థిక సంవత్సరంలో బీసీబీ ఆదాయం 60 శాతం వరకు పడిపోవచ్చని అంచనా. అంతేకాదు, ఆగస్టు–సెప్టెంబర్‌లో జరగాల్సిన భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టూర్ టీవీ హక్కుల విలువ కనీసం 10 ద్వైపాక్షిక సిరీస్‌లకు సమానమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్నికల తర్వాత మారేనా పరిస్థితి?
ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆసిఫ్ నజ్రుల్ ప్రభావం తగ్గవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుత పరిణామాలు బీసీబీ అధ్యక్షుడు బుల్బుల్‌కు జీవితకాలం గుర్తుండిపోయే చేదు అనుభవంగా మిగిలే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
