Warren Buffett Donation | వారెన్ బఫెట్ మరో భారీ విరాళం.. రూ.49 వేల కోట్ల సంపద దానం!

Warren Buffett Donation

Warren Buffett Donation: ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానాల్లో నిలిచే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే సంపాదించిన సంపదలో గణనీయమైన భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో వారెన్ బఫెట్ ముందుంటారు. తాజాగా ఆయన తీసుకున్న మరో నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా రూ.49 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించి తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రముఖ పెట్టుబడుల దిగ్గజం వారెన్ బఫెట్ సుమారు 5.5 బిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్‌వే షేర్లను నాలుగు స్వచ్ఛంద సంస్థలకు బదిలీ చేశారు. ఇందుకోసం తన వద్ద ఉన్న 6,150 క్లాస్-ఏ షేర్లను 92.25 లక్షల క్లాస్-బీ షేర్లుగా మార్చి విరాళంగా అందించారు.

ఈ విరాళాల్లో సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు అత్యధికంగా 36.90 లక్షల షేర్లు కేటాయించారు. మిగిలిన మూడు సంస్థలైన షెర్వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్‌లకు ఒక్కొక్కదానికి 18.45 లక్షల షేర్ల చొప్పున అందించారు. ఈ సంస్థల నిర్వహణ బాధ్యతలను బఫెట్ పిల్లలు సూసీ, హోవార్డ్, పీటర్ చూసుకుంటున్నారు. ప్రతి ఏడాది థ్యాంక్స్‌గివింగ్ సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ లేఖ రాసే బఫెట్.. ఈసారి కూడా మానవత్వం, దయాగుణం గొప్పతనాన్ని ప్రస్తావించారు. ఇతరుల పట్ల ప్రేమతో, దయతో వ్యవహరించడానికి డబ్బు అవసరం లేదని, కానీ దాని వల్ల కలిగే ప్రయోజనం మాత్రం అపారమని పేర్కొన్నారు. దయతో చేసే పనులు నిరంతరం సానుకూల ఫలితాలను అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తన దివంగత వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్‌తో కలిసి చేసిన పెట్టుబడుల కంటే కూడా మానవత్వంతో చేసే సేవలకు ఎంతో విలువ ఉందని వివరించారు.

మరోవైపు బెర్క్‌షైర్ హాత్‌వే షేర్లు కూడా ఈ ఏడాది మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. నాలుగో త్రైమాసికం ప్రారంభమైనప్పటి నుంచి వాటి విలువ 19 శాతానికి పైగా పెరిగినట్లు సమాచారం. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 7.5 శాతం పాయింట్ల మెరుగైన పనితీరును కనబరిచాయి. ఇంత భారీగా విరాళాలు అందించినప్పటికీ బఫెట్ వద్ద ఇంకా సుమారు 162 బిలియన్ డాలర్ల విలువైన క్లాస్-ఏ షేర్లు ఉన్నట్లు వెల్లడైంది. మిగిలిన షేర్లను కూడా ఈ నాలుగు సంస్థలకే విరాళంగా అందించాలన్నది ఆయన ముందస్తు నిర్ణయం. ఆయా సంస్థలు తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేలా ప్రతి సంవత్సరం గ్రాంట్లను పెంచాలన్నది ఆయన లక్ష్యంగా తెలుస్తోంది. తన పిల్లల సేవా కార్యక్రమాల పట్ల కూడా బఫెట్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. అవసరంలో ఉన్నవారికి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు వారు బాధ్యతాయుతంగా నిధులు కేటాయిస్తున్నారని ప్రశంసించారు. మొత్తంగా చూస్తే.. సంపదను సంపాదించడం ఒక విజయమైతే, దానిని సమాజ అభ్యున్నతికి ఉపయోగించడం అంతకంటే గొప్ప విజయమని వారెన్ బఫెట్ తన చర్యలతో మరోసారి నిరూపించారు. ఆయన అందించిన ఈ భారీ విరాళం ప్రపంచవ్యాప్తంగా దాతృత్వానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలవనుంది.

Related posts

Gold and silver prices | పసిడి ప్రియులకు భారీ గుడ్‌న్యూస్.. ఒక్కరోజే వేలల్లో తగ్గిన బంగారం ధరలు!

Gold Price Today | సామాన్యులకు భారీ ఊరట.. అమాంతం పడిపోయిన గోల్డ్ రేట్స్!

UPI MDR Charges New Rules | దీపావళి తర్వాత యూపీఐలో కొత్త రూల్స్.. పూర్తి వివరాలివే!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More