VS Babu: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య విషాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు పొందిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు ఇకలేరు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి చెందిన కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు గురువారం గుండెపోటుతో మరణించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 9న చెన్నైలోని అమింజికరై ప్రాంతంలో ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్నారు.
అయితే, గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గుండెపోటు రావడంతో మధ్యాహ్నం 2:24 గంటలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎంజీఎం ఆసుపత్రి వైద్య బులెటిన్ వెల్లడించింది. మరోవైపు, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై వీఎస్ బాబు విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. స్టాలిన్‌ను ఓడించడంతో ఆయనకు జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు వచ్చింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కొద్ది నెలలకే ఆయన మరణించడం టీవీకే శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.