Reliance Foundation | కోనసీమ మత్స్యకారులకు భారీ ఊరట.. రంగంలోకి రిలయన్స్ ఫౌండేషన్!

Reliance Foundation

Reliance Foundation: తుఫాన్ బీభత్సంతో సముద్రంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఇప్పుడు కొత్త ఆశ చిగురిస్తోంది. ప్రకృతి ప్రకోపం కారణంగా నీటిలో కొట్టుకుపోయిన పడవలను తిరిగి ఒడ్డుకు చేర్చి, వారి జీవనోపాధిని పునరుద్ధరించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తూర్పు తీర ప్రాంతాల్లో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు, సఖినేటిపల్లి ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాల్లో భారీ నష్టం సంభవించింది. తుఫాన్ సమయంలో సముద్రం, కాలువల్లోకి కొట్టుకుపోయిన సుమారు 186 చేపల వేట పడవలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయాయి.

కొన్ని పడవలు పూర్తిగా నీటిలో మునిగిపోగా, మరికొన్ని బురదలో కూరుకుపోయాయి. ఇంకొన్ని ఒకదానిపై మరొకటి పడిపోయాయి. ఒక్కో పడవ సుమారు 5 నుంచి 10 టన్నుల బరువు ఉండటంతో వాటిని బయటకు తీసుకురావడం పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా రహదారి సౌకర్యం లేని బురద ప్రాంతాల్లో పడవలను చేతులతో వెలికితీయడం సాధ్యం కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితిని గుర్తించిన రిలయన్స్ ఫౌండేషన్ తన ‘వి కేర్’ కార్యక్రమం ద్వారా తక్షణ సహాయక చర్యలు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన అనంతరం నిపుణుల బృందాలను రంగంలోకి దించింది. అల్లవరం మండల మత్స్యశాఖ, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన క్రేన్లు, ఆధునిక యాంత్రిక పరికరాలను వినియోగిస్తోంది.

స్థానిక మత్స్యకారుల సహకారంతో పడవలు చిక్కుకున్న ప్రాంతాలను గుర్తించి, క్రేన్ ఆపరేటర్ల ద్వారా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఒక్కొక్కటిగా వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సహాయక కార్యక్రమం ద్వారా దాదాపు 10 వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలగనుంది. పడవలను త్వరగా బయటకు తీయడం వల్ల మరింత నష్టం జరగకుండా నివారించడంతో పాటు, వాటి మరమ్మతుల స్థితిని అంచనా వేసేందుకు యజమానులకు అవకాశం లభిస్తుంది. మొత్తంగా తుఫాన్ కారణంగా కుదేలైన మత్స్యకారుల జీవితాల్లో మళ్లీ ఉపాధి వెలుగులు నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. పడవలు తిరిగి వేటకు సిద్ధమైతే వేలాది కుటుంబాలకు జీవన భరోసా లభిస్తుంది. విపత్తు వేళ బాధితులకు అండగా నిలుస్తూ, వారి పునరావాసానికి సహకరిస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ చర్యలు మత్స్యకారులకు కొత్త ఆశను కలిగిస్తున్నాయి.

Related posts

Vande Bharat Express | ఏపీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖ నుంచి తిరుపతికి మరో వందేభారత్

Akvan Cyclone | ఆంధ్రప్రదేశ్‌కు తప్పిన పెను తుఫాన్ ముప్పు

Cyclone Aquan | తీర ప్రాంతాలకు భారీ హెచ్చరిక.. అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More