KCR Condolences: తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మరో విషాదం చోటుచేసుకుంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు అచ్చా విద్యాసాగర్(Accha Vidyasagar) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో విద్యాసాగర్ అందించిన సేవలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి తనతో ఉన్న ఉద్యమ అనుబంధాన్ని స్మరించుకున్నారు. వరంగల్ కేంద్రంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్ కీలక పాత్ర పోషించారని, ఆయన మరణంతో తెలంగాణ ఒక నిబద్ధత కలిగిన ఉద్యమకారుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో విద్యాసాగర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చా విద్యాసాగర్ హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చెప్పవచ్చు.