Hyderabad Park Entry Fee: హైదరాబాద్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే నగరవాసులకు ఇకపై పార్కుల సందర్శన కొంత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. నగరంలోని ప్రధాన పార్కుల్లో ప్రవేశ రుసుములను పెంచుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పార్కులకు వెళ్లే పెద్దలు, పిల్లలు గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని టికెట్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ నిర్ణయం ప్రకారం ఇప్పటివరకు పెద్దలకు రూ.10గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.20కి పెంచారు. అంటే పెద్దల టికెట్ ధర ఏకంగా రెట్టింపైంది. అదేవిధంగా పిల్లల టికెట్ ధరను రూ.2 నుంచి రూ.5కు సవరించారు. 12 ఏళ్లు పైబడిన వారిని పెద్దలుగా పరిగణించి రూ.20 వసూలు చేయనున్నారు. ఐదు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.5 టికెట్ ధరగా నిర్ణయించారు.
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇందిరా పార్క్, నారాయణగూడలోని మేల్కొటే పార్క్, జలగం వెంగళరావు పార్క్, కృష్ణకాంత్ పార్క్ సహా పలు ప్రధాన పార్కుల్లో కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే టికెట్ ధరలు పెరిగినప్పటికీ సందర్శన వేళల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో మాదిరిగానే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సందర్శకులకు టికెట్లు జారీ చేస్తారు. కాగా, జీహెచ్ఎంసీ చివరిసారిగా 2017లో ప్రవేశ రుసుములను సవరించింది. అప్పట్లో పెద్దల టికెట్ ధరను రూ.5 నుంచి రూ.10కి పెంచింది. ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి ధరలను పెంచింది. మొత్తానికి పార్కుల నిర్వహణ, సందర్శకుల సౌకర్యాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో నగరవాసులపై అదనపు భారం పడనుంది. కుటుంబంతో కలిసి పార్కులకు వెళ్లేవారు ఇకపై కొత్త టికెట్ ధరలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.