CSK Head Coach: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గత కొన్నేళ్లుగా జట్టుకు వ్యూహాత్మకంగా అండగా నిలిచిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్ 2027 సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సీఎస్‌కే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జహీర్ ఖాన్ నియామకాన్ని సీఎస్‌కే సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో భారత క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న మరో మాజీ ఆటగాడు ఇప్పుడు కోచ్‌గా సీఎస్‌కే డగౌట్‌లో కనిపించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత పేస్ దళానికి కీలకంగా వ్యవహరించిన జహీర్.. ఇప్పుడు కోచింగ్ బాధ్యతల్లో తన అనుభవాన్ని ఉపయోగించనున్నారు.
సీఎస్‌కేతో ఫ్లెమింగ్‌ది దాదాపు 17 ఏళ్ల అనుబంధం. 2009లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2026 వరకు జట్టుతో కొనసాగారు. ఈ కాలంలో సీఎస్‌కే ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించింది. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో చెన్నై విజేతగా నిలిచింది. ఇక జహీర్ ఖాన్ రాకతో సీఎస్‌కే కోచింగ్ సెటప్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాబోయే సీజన్ కోసం జట్టు కూర్పు, ఆటగాళ్ల అభివృద్ధి, బౌలింగ్ వ్యూహాలు, మ్యాచ్ ప్లానింగ్ వంటి అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. ఇటీవల ముగిసిన సీజన్ తర్వాత ఫ్లెమింగ్‌తో సీఎస్‌కే బంధం ముగియడంతో కొత్త హెడ్ కోచ్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ జహీర్ ఖాన్‌ను ఎంపిక చేసింది ఫ్రాంచైజీ. ఇప్పటికే ఐదు టైటిళ్లతో ఐపీఎల్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీఎస్‌కేకు.. జహీర్ రాకతో కొత్త వ్యూహాలు, కొత్త ఆలోచనలు జోడయ్యే అవకాశం ఉంది. ఫ్లెమింగ్ శకం తర్వాత జహీర్ ఖాన్ నేతృత్వంలో సీఎస్‌కే ఎలా రూపుదిద్దుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.