అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలంలో భార్య హత్య కేసులో భర్తను అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. నిందితుడు కుమార్ లామిని (24) కర్ణాటక రాష్ట్రం, బెలగాం జిల్లా, బాటకుర్తి తండాకు చెందిన వ్యక్తి. అతను తన భార్య సంగీత (25)తో కలిసి గుర్రంకొండ మండలంలోని మర్రిపాడులో స్థిరపడి, రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు.
కుమార్ మధ్యానికి బానిసై తరచూ తన భార్యను వేధించేవాడు. పిల్లలు పుట్టలేదని ఆమెను నిత్యం హింసించేవాడు. గత నెల 27 రాత్రి కుమార్ తన భార్యను పథకం ప్రకారం హత్య చేసి, ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. గ్రామస్థులను మోసగించి, సంగీత మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్‌లో తన స్వగ్రామమైన బాటకుర్తి తండాకు తీసుకెళ్లి, అక్కడ దహన సంస్కారం జరిపాడు.
గ్రామస్థుల అనుమానంతో ఈ కేసును గుర్రంకొండ ఎస్సై మధు రామ చంద్రుడు, వాల్మీకిపురం సీఐ ప్రసాద్ బాబు లోతుగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడి గత చరిత్రను పరిశీలించి, అనేక ఆధారాలను సేకరించారు. విచారణలో కుమార్ తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు.
నేరం అంగీకరించినందున నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు వెల్లడించారు. హత్య కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.