విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఛావా’ సినిమా బాలీవుడ్‌లో ఘన విజయాన్ని సాధించింది. మహారాష్ట్ర వీరయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది.
తొలి షో నుంచే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘ఛావా’ ప్రస్తుతం తెలుగులోకి రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. విజువల్‌గా ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది.
ధైర్యం, వీరోచితత, దేశభక్తి మేళవించిన ‘ఛావా’ కథ, విజువల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ పోషించిన శక్తివంతమైన పాత్ర, రష్మిక మందన్న పాత్ర ఈ ట్రైలర్‌లో ఆకర్షణగా నిలిచాయి. గీతా ఆర్ట్స్ ద్వారా తెలుగులో విడుదల కావడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.
ఈ చిత్రం మార్చి 7న తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో ఇప్పటికే విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా భారీగా ఆడియన్స్‌ను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రేక్షకులలో ‘ఛావా’పై ఆసక్తి పెరుగుతుండటంతో టాలీవుడ్‌లో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఆడుతుందో చూడాలి.