తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకే అంకితం చేసిన వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర వార్తపై పలు వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మొక్కలు నాటడాన్ని జీవన లక్ష్యంగా ఎంచుకుని, కోటి దాటిన మొక్కలను విత్తిన ఈ గ్రీన్ వారియర్ మరణం తెలంగాణకు తీరని లోటుగా నిలిచింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన మృతిపై స్పందిస్తూ, రామయ్య చేసిన సేవలు మరవలేనివని అన్నారు. చెట్ల పేర్లను కుటుంబ సభ్యులకు పెట్టడం ద్వారా పర్యావరణంపై ఆయన ప్రేమను చాటారని తెలిపారు. సాధారణ జీవితం గడుపుతూ అసాధారణ సేవలు అందించిన వ్యక్తిగా రామయ్యను కొనియాడారు.
రామయ్య చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించిందని సంజయ్ గుర్తు చేశారు. పద్మ పురస్కారాన్ని పొందినప్పటికీ అహంభావం లేకుండా, సామాన్యుడిలా జీవిస్తూ సేవల కొనసాగించారని వివరించారు. మొక్కలే మన భవిష్యత్తు అనే సందేశాన్ని సమాజానికి విస్తృతంగా చేరవేసిన వ్యక్తిగా రామయ్య నిలిచిపోయారని అన్నారు.
వనజీవిగా ప్రఖ్యాతి పొందిన రామయ్య మరణం పర్యావరణ చైతన్యాన్ని నడిపించే వ్యక్తిని కోల్పోయినట్లుగా ఉందని బండి సంజయ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ ఉద్యమాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరమో కూడా ఆయన గుర్తు చేశారు.