TGPSC: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో శుభవార్త అందించింది. పాఠశాల విద్యా శాఖ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (DIET) కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనున్నారు.
వీటిలో మల్టీజోన్–1 పరిధిలో 53 పోస్టులు, మల్టీజోన్–2 పరిధిలో 33 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలలో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా, మిగిలిన 63 పోస్టులు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్ విభాగానికి చెందినవిగా పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 24, 2026 నుంచి ప్రారంభమై జూలై 29, 2026 వరకు కొనసాగుతుంది.
ఈ ఉద్యోగాలకు అర్హత పొందాలంటే వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. విద్యార్హతల విషయానికి వస్తే, సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) పూర్తి చేసి ఉండాలి. అలాగే NCTE గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం 55 శాతం మార్కులతో M.Ed డిగ్రీ కూడా అవసరం.
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు అందనున్నాయి. సీనియర్ లెక్చరర్ పోస్టుకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు, లెక్చరర్ పోస్టుకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతన శ్రేణి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలు, సిలబస్ మరియు పరీక్షా విధానం కోసం TGPSC అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.in ను సందర్శించాలని కమిషన్ సూచించింది.








