ఇంట గెలిచి రచ్చ గెలవమనేది సామెతను నిజం చేస్తూ అనన్య నాగళ్ల నటన పరంగా సత్తా చాటుతుంది. మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో మొదలైన ఆమె సినీ ప్రయాణం నెమ్మదిగా వృద్ధి చెందుతూ ప్లేబ్యాక్, తంత్ర, పొట్టేల్, బహిష్కరణ వంటి ప్రాజెక్టుల ద్వారా మంచి నటిగా నిలిచింది. వెబ్ సిరీస్‌లకు మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య ఇప్పుడు మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతుంది.
తెలుగమ్మాయి అనన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఏక్తా ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హిమ్మత్ లడుమోర్ నిర్మిస్తున్న ఓ మహిళా ప్రధాన చిత్రంలో లీడ్ రోల్ చేయనుంది. ఈ సినిమాకు రాకేష్ జగ్గి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనన్య ఆదివాసి మహిళగా నటిస్తుందని సమాచారం. ఈ పాత్ర కోసం ఆమె స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘కాంత’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ముంబయ్ హీరోయిన్‌లు తెలుగు చిత్రసీమలో తన సత్తా చాటుతున్న తరుణంలో, మన తెలుగు అమ్మాయి హిందీ సినిమాల్లో కీలక పాత్ర పోషించడం గర్వించదగిన విషయం. ఇది అనన్య కెరీర్‌లో ఓ కీలక మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
అనన్య నటనలో నైజాన్ని చూపిస్తూ మెల్లగా తన స్థానం ఏర్పరుచుకుంటోంది. సినిమాలు ఎన్నుకోవడంలో సెన్సిబిలిటీ చూపించగలిగిన నటి అనే పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీతో ఆమె పేరు దేశవ్యాప్తంగా వెలుగుతుందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. “తెలుగు తేజాన్ని హిందీ తెరపై చాటాలనే అనన్యకు శుభాకాంక్షలు” అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.