మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మల ప్రేమకథ బహిరంగ రహస్యమే. 2023 నుంచి కొనసాగుతున్న వారి రిలేషన్‌షిప్‌పై పలు సందర్భాల్లో వాళ్లే స్వయంగా వెల్లడించారు. ఫంక్షన్లలో జంటగా కనిపిస్తూ తమ బంధాన్ని బయటపెట్టారు. రేపోమాపో పెళ్లి వార్త చెబుతారనుకున్న అభిమానులకు తాజాగా షాకింగ్ న్యూస్ వచ్చింది.
తమన్నా, విజయ్ వర్మలు విడిపోయారని, కొన్ని రోజులుగా విడిగా ఉంటున్నారని సమాచారం. ఏమిటి కారణమో తెలియదుగానీ, వారి రిలేషన్ ముగిసిందని పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే, ప్రేమికులుగా విడిపోయినా, స్నేహితులుగా కొనసాగుతామంటూ వారు చెబుతున్నట్టు సమాచారం. వృత్తిపరంగా ఒకరినొకరు గౌరవించుకుంటారని వారి సన్నిహితులు చెబుతున్నారు.
ఈ బ్రేకప్ వార్తలపై తమన్నా లేదా విజయ్ వర్మ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. వారాలుగా వార్తలు వస్తున్నా ఇద్దరూ ఈ విషయంపై స్పందించకపోవడం ఆసక్తిగా మారింది. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారని సమాచారం.
తమన్నా, విజయ్ వర్మ పెళ్లిపీటలు ఎక్కనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు వారి ప్రేమ బంధం ముగిసిందని తెలుస్తోంది. అభిమానులు ఈ వార్తపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి గాసిప్స్ మధ్య వచ్చిన ఈ బ్రేకప్ వార్త నిజమేనా? లేక ఇంకా ఏదైనా మలుపు ఉందా? అన్నది వేచి చూడాలి.