Swayam-AP: ఆంధ్రప్రదేశ్‌లోని పచ్చళ్లు, కారంపొడులు, అగరబత్తీలు వంటి డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ఇకపై విస్తృతంగా మార్కెటింగ్ అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పటివరకు గ్రామాలు, పట్టణాలకే పరిమితమైన ఈ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది.
ఈ ఉత్పత్తులను తొలిసారిగా ప్రభుత్వమే ‘స్వయం-ఏపీ’ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేయనుంది. ప్యాకింగ్, బ్రాండింగ్, ప్రమోషన్, విక్రయాల వరకు ప్రతి దశలో మహిళలకు పూర్తి మద్దతు అందించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద తొలి దశలో 60 ఉత్పత్తులను ఎంపిక చేశారు. వీటిని ఆగస్టు 1 నుంచి మార్కెట్లోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట పట్టణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు ప్రారంభించి, తర్వాత జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి విస్తరించనున్నారు. ఈ పథకానికి దాదాపు రూ.10 కోట్ల ఖర్చు కేటాయింపులు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్ పరిధిలో సుమారు 86 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. విభిన్న ఉత్పత్తులను తయారు చేస్తున్నా, మార్కెటింగ్ లోపం కారణంగా ఇప్పటివరకు సరైన ఆదాయ వృద్ధి కనిపించలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా మార్కెటింగ్, నాణ్యత ప్రమాణాలు, లైసెన్సింగ్, ప్యాకేజింగ్ అంశాలను పర్యవేక్షించేందుకు ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఆన్‌లైన్ విక్రయాల కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఓఎన్‌డీసీ వంటి ఈ-కామర్స్ వేదికలతో ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే విశాఖపట్నం, విజయవాడలో ఆర్డర్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, అక్కడి నుంచే ప్యాకింగ్, నిల్వ, పంపిణీ నిర్వహించనున్నారు.
వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్నా లేకపోయినా మహిళలకు ముందుగానే నిర్ణయించిన ధర చెల్లించేలా ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. దీంతో అమ్మకాల ఆలస్యం జరిగినా వారి ఆదాయం ప్రభావితం కాకుండా ఉండనుంది.
మొదటి దశలో తూర్పుగోదావరి నుంచి మంగళగిరి, తిరుపతి వరకు అనేక జిల్లాల్లో తయారయ్యే ఉత్పత్తులను ఎంపిక చేశారు. అగరబత్తీలు, పచ్చళ్లు, పట్టు చీరలు, కొండపల్లి బొమ్మలు, మిల్లెట్ ఉత్పత్తులు, నూనెలు, చేతి కళాకృతులు వంటి విభిన్న వస్తువులు ఇందులో ఉన్నాయి. ‘స్వయం-ఏపీ’ బ్రాండ్ ద్వారా డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు కొత్త గుర్తింపు తీసుకురావడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.








