కంచ గచ్చిబౌలి భూముల వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వెళ్లింది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా, భూముల్లో చెట్ల నరికివేతపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల తొలగింపు అనుమతులు లేకుండా జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులపై జైలు శిక్షలు విధిస్తామంటూ హెచ్చరించింది.
జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం… 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు తీసుకున్నారా లేదా అనే ప్రశ్నను తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని అడిగారు. దీనిపై స్పందించిన సింఘ్వీ… వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వ చర్యలు జరిగాయని, చెట్ల తొలగింపుకు ముందే అనుమతులు తీసుకున్నామని వివరించారు.
అయితే, అమికస్ క్యూరీ సీఈసీ నివేదికను ప్రస్తావిస్తూ రూ.10వేల కోట్ల విలువైన భూములు మార్టిగేజ్ చేశారన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, భూముల మార్టిగేజ్ అంశం తమకు ప్రాధాన్యం కాదని, అనుమతుల విషయమే కీలకమని స్పష్టం చేసింది.
వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రస్తుత స్థితిని కొనసాగించాలని స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికైతే ఈ వ్యవహారం రాష్ట్రానికి పెద్ద చిక్కుగా మారింది.