NEET 2026 re-exam: నీట్-2026 పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో పరీక్షను రద్దు చేసిన అధికారులు, తాజా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చకు దారితీయగా, రీ-ఎగ్జామ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేస్తూ పరీక్ష నిర్వహించనున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా కేంద్ర బలగాలను కూడా అప్రమత్తం చేశారు.
ఇక పరీక్ష రాసేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా భారతీయ రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు మార్గాల్లో అదనపు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. విశాఖపట్నం-పలాస మార్గంలో ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకురాగా, విద్యార్థుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని సమయాలను రూపొందించారు. అలాగే తిరుపతి-చర్లపల్లి మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
ఈ రైళ్లు మధ్యలో పలు ముఖ్య స్టేషన్లలో ఆగే విధంగా షెడ్యూల్‌ను రూపొందించారు. రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, డోన్, కర్నూలు టౌన్, గద్వాల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో హాల్ట్‌లు కల్పించారు.
నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రయాణానికి సంబంధించిన వివరాలను ముందుగానే తెలుసుకుని, నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది అభ్యర్థులకు ఊరటనివ్వనుంది.
NEET 2026 re-exam | నీట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మూడు మార్గాల్లో స్పెషల్ ట్రైన్లు
-








