టాలీవుడ్ ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ఆమె నిన్న హైదరాబాద్ నిజాంపేటలోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నిద్రమాత్రల ప్రభావంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచినట్లు వెల్లడించారు. ఇన్ఫెక్షన్ కారణంగా ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇంకా పూర్తిగా మానసిక, శారీరక పరిస్థితి మెరుగుపడాల్సి ఉందని చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కల్పనను ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన ఒత్తిళ్లే కారణమా? లేదా వేరే కారణాలున్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఆమె భర్త ప్రసాద్‌ను కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
కల్పన టాలీవుడ్‌లో ఎన్నో హిట్ పాటలకు తన గాత్రాన్ని అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. త్వరలోనే ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.