సినీ నటుడు మరియు రాజకీయ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందిన పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సూళ్లూరుపేట పోలీసులు ఇటీవల ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోసాని కోర్టును ఆశ్రయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, ప్రస్తుతం ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకూడదని పోలీసులకు స్పష్టం చేసింది.
ఈ కేసులో పోలీసులు అదనంగా IPC 111 సెక్షన్‌తో పాటు మహిళలను అసభ్యంగా చూపించారంటూ మరికొన్ని సెక్షన్లు నమోదు చేశారు. అయితే, ఈ సెక్షన్ల వర్తింపు తీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ అధికారి మురళీకృష్ణపై కోర్టు గట్టిగా స్పందించింది. తన ఆదేశాలను పట్టించుకోకుండా చర్యలు తీసుకున్నారంటూ ఆయనపై కోర్టు సీరియస్ అయింది.
కోర్టు, ‘‘ఈ సెక్షన్లు అసలు ఎలా వర్తిస్తాయి?’’ అంటూ ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో మురళీకృష్ణకు ఫామ్ 1 నోటీసును జారీ చేసింది. తదుపరి విచారణలో రిప్లై కౌంటర్‌ను తప్పనిసరిగా దాఖలు చేయాలని స్పష్టం చేసింది. పోలీసుల వైఖరిపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. దీంతోపాటుగా, ఈ కేసులో పోలీసుల తీరు, అధికారి బాధ్యతలపై మరింత లోతుగా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక పోసాని విషయంలో చివరికి కోర్టు తుది తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.