ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మరోసారి ఆర్థిక ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ’ (PM Kisan-Annadata Sukhibhava)పథకం కింద 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన తొలి విడత సాయాన్ని విడుదల చేసింది.లింగంగుంట్లలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి రైతులకు నిధుల బదిలీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 46.85 లక్షల మంది రైతు కుటుంబాలకు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా రూ.3,125 కోట్లను జమ చేశారు. రైతుల పెట్టుబడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే సమయానికే ఈ ఆర్థిక సాయం అందించారు. ప్రారంభ విడతలో భాగంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.7 వేల మేర నిధులు అందుతున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.5 వేలు అందించగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు జమ చేసింది. దీంతో రైతులకు సాగు ఖర్చుల భారం కొంత మేర తగ్గనుంది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం మూడు విడతల్లో రైతులకు సాయం అందించనున్నారు. ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల వరకు ఆర్థిక సహాయం అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్రం రూ.6 వేలు అందిస్తోంది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ రైతుల ఆదాయాన్ని బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంటోంది. తాజా నిధుల విడుదలతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతు కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.








