అంతరిక్షంలో అరుదుగా జరిగే ప్లానెటరీ పరేడ్‌ను ప్రముఖ ఫొటోగ్రాఫర్ జోష్ డ్యూరీ తన కెమెరాలో బంధించారు. ఈ ఖగోళ అద్భుతం ఈ నెల 22న చోటుచేసుకుంది. మొత్తం 8 గ్రహాల్లో 7 గ్రహాలను భూమి నుంచి స్పష్టంగా చూడగలిగే విధంగా ఆయన ఫోటో తీశారు. సౌరమండలంలోని గ్రహాలన్నీ తమ కక్షల్లో తిరుగుతూ ఒకే వరుసలోకి రావడం చాలా అరుదుగా జరుగుతుంది.
భారతదేశంలో ఈ ప్లానెటరీ పరేడ్‌ను శుక్రవారం (28న) రాత్రి టెలిస్కోప్ సహాయంతో వీక్షించవచ్చు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న బుధుడు నుంచి దూరంగా ఉన్న నెఫ్ట్యూన్ వరకు మొత్తం ఏడు గ్రహాలను భూమి నుంచి చూడగలిగే అరుదైన అవకాశం 40 ఏళ్ల తర్వాత మాత్రమే మరోసారి లభిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో 1982లో ఇదే విధమైన గ్రహ పరిణామం చోటుచేసుకుంది.
జోష్ డ్యూరీ ఈ అద్భుత దృశ్యాన్ని ఫోటో తీయడానికి ఇంగ్లాండ్‌లోని సోమర్ సెట్ గ్రామంలోని మెండిప్ హిల్స్‌ను ఎంచుకున్నారు. అక్కడ విశాలమైన ఆకాశం స్పష్టంగా కనిపించడంతో, పనోరమా మోడ్ ఉపయోగించి ఫిష్ ఐ లెన్స్ సహాయంతో 7 గ్రహాలను ఒకే ఫ్రేమ్‌లో బంధించగలిగారు. బుధుడు, నెఫ్ట్యూన్, శాటర్న్‌లను గుర్తించడం కాస్త క్లిష్టంగా అనిపించినప్పటికీ, ఇమేజ్ అనాలసిస్, ఖగోళ యాప్‌ల సహాయంతో సరిగ్గా గుర్తించగలిగారు.
ఈ అరుదైన ఖగోళ సంఘటనకు సంబంధించిన ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఖగోళ ప్రేమికులు, శాస్త్రవేత్తలు దీనిపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఈ ప్లానెటరీ పరేడ్‌ను వీక్షించే అవకాశం రాబోయే కాలంలో మరోసారి రావడం చాలా దూరం అని, ఇప్పుడున్న వీక్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.