Pakistan: పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్లు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు పేలుడు ఘటనల్లో మొత్తం ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనలతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు అప్రమత్తమై విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించాయి.
పోలీసుల వివరాల ప్రకారం, మొదటి పేలుడు రోడ్డుపై వెళ్తున్న ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగింది. ఈ దాడిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్థలానికి సహాయక బృందాలు చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించిన కొద్ది సమయానికే రెండో పేలుడు సంభవించింది. ఈ రెండో ఘటనలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనలపై ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించలేదు. అయితే గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) పాత్ర ఉండొచ్చని భద్రతా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో ఉగ్రదాడుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. తాజా పేలుళ్లతో దేశ భద్రతా వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.








