NEET-UG re-exam: నీట్-యూజీ రీటెస్ట్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. 21వ తేదీన నిర్వహించనున్న రీటెస్ట్‌కు సంబంధించి వస్తున్న రూమర్లు, అపోహలను పట్టించుకోవద్దని విద్యార్థులకు తెలిపింది. పరీక్ష వాయిదా పడుతుందన్న సోషల్ మీడియా ప్రచారాన్ని పూర్తిగా నిరాకరిస్తూ, అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని ఎన్‌టీఏ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేసింది.
ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో భద్రతా చర్యలు బలోపేతం చేసినట్లు తెలిపింది. విద్యార్థులు పరీక్షపై ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా సిద్ధం కావాలని ఎన్‌టీఏ సూచించింది. “ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మీరు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఉత్తమ ప్రదర్శనపై దృష్టి పెట్టండి” అని అభ్యర్థులకు సందేశం ఇచ్చింది. పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్షను కట్టుదిట్టమైన బహుళ అంచెల భద్రతా వ్యవస్థలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గతంలో జరిగిన పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3నాటి పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటే మానస్ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ (14416)ను సంప్రదించాలని సూచించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.








