ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ఇంటికొక పారిశ్రామిక వేత్త లక్ష్యాన్ని సాధించడంలో MSME మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, MSMEల స్థాపనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి పలు కీలక విషయాలు ప్రస్తావించారు. కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కో కిసాన్ సెజ్, ఏపీఐఐసీ భూములు, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూములు పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు MSMEల ఏర్పాటుపై ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మెగా అగ్రికల్చర్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా విక్రయించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలన్నారు.
నెల్లూరు జిల్లా తీరప్రాంతాల్లో ఇసుక మేట సమస్య కారణంగా మత్స్యకారులు పడవలు నడపేందుకు ఇబ్బంది పడుతున్నారని, దీని పరిష్కారానికి మిని జెట్టీల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. తీరప్రాంత అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందని వివరించారు.
MSME మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రతి జిల్లాలో ముగ్గురు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లను నియమించి, ఆసక్తి ఉన్న పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ పాలసీలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ సహాయంతో స్థానిక పరిశ్రమల అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.