పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గిరిజన గ్రామాల రైతులు తమ భూముల గుర్తింపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోకవలస గ్రామానికి చెందిన గిరిజన రైతులు, తమకు భూములకు పట్టాలు ఇచ్చినా, భూమి ఎక్కడ ఉందో తెలియడం లేదని వాపోయారు. ఆన్లైన్‌లో కూడా రికార్డులు నమోదు కాలేదని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాల భూసమస్యలు తీవ్రంగా పెరిగాయని, గిరిజన రైతులకు ఇచ్చిన భూములు కేవలం కాగితాల్లోనే మిగిలిపోయాయని ఆరోపిస్తున్నారు. పట్టా ఉందన్న నమ్మకం తప్ప, భూమిని సాగుచేసుకునే అవకాశం లేకపోవడంతో జీవనాధారం కోల్పోతున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ భూమి యొక్క స్థానం, హద్దులను స్పష్టంగా గుర్తించాలంటూ గిరిజన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ భూములు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో ప్రభుత్వం పరిశీలించి, భౌగోళిక సర్వే చేయాలని, వారి భూములను వారికే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ భూమిని గుర్తించి అప్పగిస్తారని గిరిజన రైతులు ఆశిస్తున్నారు. భూములపై పూర్తి హక్కు పొందేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖలు తక్షణమే స్పందించాలని గిరిజన సంఘాలు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.