రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన రైతు ఎంఏ సూకుర్ తన భూమిపై అక్రమంగా కన్నేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2006లో 3 ఎకరాల 29 గుంటల భూమిని కొనుగోలు చేశానని, దీనికి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఎలాంటి నకిలీ పత్రాలు సృష్టించలేదని, కానీ కొంత మంది తన భూమిని స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
తన భూమిని బలవంతంగా హస్తగతం చేసుకునేందుకు కొందరు అక్రమ ప్రయత్నాలు చేస్తున్నారని సూకుర్ తెలిపారు. అర్థబలం, అంగబలం ఉన్నవారుగా చూపిస్తూ తనను బెదిరిస్తున్నారని, గత 25 సంవత్సరాలుగా తన కుటుంబం ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నదని వివరించారు. ఇన్నేళ్ల తర్వాత అకస్మాత్తుగా కొందరు వచ్చి మా భూమి అని బెదిరించడాన్ని తాను తట్టుకోలేనని అన్నారు.
భూమిని కొనుగోలు చేసేముందు పత్రికలో పబ్లిక్ నోటీసు ఇచ్చానని, నెల రోజుల తర్వాతే రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలిపారు. అయినప్పటికీ కొంత మంది నకిలీ పత్రాలతో తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇది న్యాయబద్ధమైన వ్యవహారమా? అని ప్రశ్నించారు.
తన హక్కును తిరిగి సాధించుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కుతానని, తన కష్టార్జిత భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోనని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కావలి జంగయ్య, గద్ద గూటి కుమార్ తదితరులు పాల్గొని రైతుకు మద్దతు తెలిపారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.