ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బబ్లూ అనే వ్యక్తి తన భార్య రాధికను ఆమె ప్రియుడు విశాల్‌కుమార్‌కి ఇచ్చి పెళ్లి జరిపించాడు. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, తాజాగా బబ్లూ దీనిపై స్పందిస్తూ, తన భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు.
బబ్లూ మాట్లాడుతూ, “ఇటీవలి రోజుల్లో భర్తలను వారి భార్యలు చంపడం చూస్తున్నాం” అని చెప్పాడు. ముఖ్యంగా మీరట్‌లో జరిగిన ఘటన తన నిర్ణయానికి కారణమైందని చెప్పాడు. ఓ యువతి తన భర్తను ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆకస్మాత్తుగా నాపైనా అలాంటి ప్రమాదం వస్తుందేమో అనే భయంతోనే ఈ పెళ్లి జరిపించా” అని వివరించాడు.
2017లో బబ్లూ, రాధిక వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, రాధికకు విశాల్‌తో వివాహేతర సంబంధం ఉండటం బబ్లూకి తెలిసింది. ఈ విషయం గురించి రాధికను ప్రశ్నించినా, ప్రియుడిని వదులుకోవడానికి అంగీకరించలేదు. దీంతో తనకు హాని జరగకుండా ఉండటానికి తానే స్వయంగా రాధిక, విశాల్‌ల వివాహానికి ఏర్పాట్లు చేశాడు.
మొదట కోర్టు పెళ్లి చేయించిన బబ్లూ, ఆ తర్వాత ఒక ఆలయంలో దండలు మార్చుకునేలా చేశాడు. తన కుటుంబ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇప్పుడు ప్రశాంతంగా జీవించగలనని బబ్లూ చెప్పాడు. ఈ ఘటనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.