పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం, కళ్లికోట, దుగ్గి, గంగిరేగువలస, గుణానపురం, పరసురామపురం, శివుని, విక్రమ్ పురం ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల భయంతో పొలాల్లోకి వెళ్లలేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
2017లో ఒడిశా నుండి వచ్చిన ఏనుగుల వల్ల ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, 6 కోట్ల రూపాయల మేర పంట నష్టం వాటిల్లింది. అయినప్పటికీ ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం నెల రోజులు పూర్తి చేసుకుంటున్నా, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగుల తరలింపు గురించి ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి విమర్శించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు.
ఇప్పటికైనా ఏనుగుల నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. రైతుల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.