ఐపీఎస్ అధికారి అయినవారికి రాజ్యాంగం, చట్టం మీద నమ్మకముండాలి. కానీ పీవీ సునీల్ తన కులాన్ని ఉపయోగించి తప్పులనుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ ఆరోపించారు. సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన, తప్పు చేసినవారికి కులరక్షణ ఉండకూడదని స్పష్టం చేశారు.
సునీల్ సస్పెన్షన్ తర్వాత ఆయన అనుచరులు, వైసీపీ మద్దతుదారులు, అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు ఈ నిర్ణయాన్ని కులపరమైనదిగా చిత్రీకరించాలని ప్రయత్నించారు. కానీ పీవీ రమేష్ ఈ వాదనను తిప్పికొట్టారు. భార్యపై నేరాలు చేసిన వ్యక్తిగా సునీల్‌పై సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోందని, అలాంటి వ్యక్తి పోలీసు సేవల్లో కొనసాగడం సరికాదని ఆయన అన్నారు.
నేరస్తుడికి మతం, కులం లేదని, నేరం చేసినవారిని ఉపేక్షించకూడదని పీవీ రమేష్ స్పష్టం చేశారు. పీవీ సునీల్ తన అధికారాన్ని ఉపయోగించి వైసీపీ ప్రభుత్వ హితుల కోసం చాలా మందిపై అణిచివేత చర్యలు చేపట్టారని ఆరోపించారు. ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని ఆసరాగా చేసుకుంటున్నారని తెలిపారు.
సునీల్ తనపై ఉన్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, న్యాయం కోసం పోరాడే ప్రజలందరూ ఇలాంటి అన్యాయాలను ఖండించాలని పీవీ రమేష్ పిలుపునిచ్చారు. కుల ప్రాతిపదికన రక్షణ పొందేందుకు చేసిన ఈ ప్రయత్నం రాజ్యాంగంపై కుట్రే అని ఆయన అభిప్రాయపడ్డారు.