కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. ప్రతాపవాడలో ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడి, కత్తులతో బెదిరించి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. 80 తులాల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు, ఇంటి యజమాని రాఘవరెడ్డి దంపతులపై దాడి చేశారు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి.
దొంగతనం జరిగే ముందు దుండగులు ఇంటి ముందు ఉన్న నీటి మోటార్ ఆన్ చేసి, ట్యాంక్ నిండిన నీళ్లు కిందపడేలా చేశారు. ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న వృద్ధులు మేలుకుని బయటకు రాగానే, దొంగలు వారిపై దాడి చేసి ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఇంట్లో ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే విషయంపై విచారణ కొనసాగుతోంది.
ఇటీవల హుజురాబాద్ పరిసరాల్లో దొంగతనాలు పెరుగుతుండటంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను త్వరగా పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని వారు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పోలీసులు ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అపరిచిత వ్యక్తులను అనుమానాస్పదంగా గమనించాలని ప్రజలకు సూచించారు.