BJP: హైదరాబాద్‌లో జరిగిన ఓ కీలక భేటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావ(N Ramchander Rao), మెగా చిరంజీవితో(Megastar Chiranjeevi) ఆయన నివాసంలో సమావేశం కావడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. టాలీవుడ్ ఈ సందర్భంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ భేటీపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తిగా సినీ రంగంపైనే దృష్టి కేంద్రీకరించిన చిరంజీవిని బీజేపీ కీలక నేత కలవడం సహజంగానే ఆసక్తిని పెంచింది.
అధికారిక సమాచారం ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశ ఆర్థిక ప్రగతికి సంబంధించిన అంశాలను వివరిస్తూ ప్రత్యేక పుస్తకాలు, సమాచార పత్రాలను చిరంజీవికి అందజేసినట్లు సమాచారం.
దేశ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనా లేక రాజకీయపరంగా మరేదైనా ప్రాధాన్యం ఉందా అనే అంశంపై చర్చ కొనసాగుతోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి, అనంతరం కాంగ్రెస్‌లో చేరి కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన పేరు మళ్లీ రాజకీయ చర్చల్లోకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న నేపథ్యంలో, చిరంజీవి-బీజేపీ సమావేశానికి రాజకీయంగా మరింత ప్రాధాన్యం ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.








